Welcome To GK BITS IN TELUGU Blog
కేంద్ర బడ్జెట్ (2021-22) - భారత దేశం
[UNION BUDGET (2021-22)] - INDIA
- 'ఆత్మనిర్భర్' (ATMANIRBHAR) పేరుతో 2021-22 ఆర్ధిక సంవత్సరానికి రూ. 34,83,236 కోట్లతో ఆత్మరక్షణాత్మక బడ్జెట్ ను కేంద్ర ఆర్ధిక మంత్రి 'నిర్మలా సీతారామన్' (Nirmala Sitharaman) 2021 ఫిబ్రవరి 1న లోక్ సభలో తొలిసారిగా 'డిజిటల్ పధ్ధతి' లో ప్రవేశపెట్టారు.
- కేంద్ర ఆర్ధిక మంత్రి 'నిర్మలా సీతారామన్' తన ట్రేడ్ మార్క్ 'బాహీ - ఖాతా' (BAHI KHATA) ను అనుసరించారు. గతంలో ఆర్ధిక మంత్రులు తెచ్చినట్లు బ్రీఫ్ కేస్ కాకుండా .. ఎర్రటి వస్త్రం చుట్టిన ఓ రిజిస్టరులో బడ్జెట్ దస్తావేజులతో పార్లమెంటుకు వచ్చారు.
- సాధారణంగా 'కాటన్, కోటా డోరియా, ఇకత్' లాంటి చేనేత చీరలతో కనిపించే 'నిర్మలా సీతారామన్' .. ఈసారి పశ్చిమ బెంగాల్ ప్రజలు పవిత్రంగా భావించే "లాల్ పాడ్ సఫేద్" చీరను ధరించి బడ్జెట్ సెషన్ కు హాజరయ్యారు.
ఆరు మూల స్తంభాలు (SIX PILLARS) :
- 2021-22 కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనలు ముఖ్యంగా క్రింది ఆరు మూల స్తంభాలపై రూపొందాయి.
- ఆరోగ్యం - యోగక్షేమాలు (Health & Well-being)
- ఆర్ధిక రంగం - మౌలిక సదుపాయాలు (Physical & Financial Capital & Infrastructure)
- సమ్మిళిత వృద్ధి - ఆకాంక్షపూరిత భారత్ (Inclusive development for Aspirational India)
- మానవ వనరులు (Reinvigorating Human Capital)
- నవకల్పనలు - పరిశోధన - అభివృద్ధి (Innovation & R&D)
- కనిష్ఠ ప్రభుత్వం - గరిష్ఠ పాలన (Minimum Govt & Maximum Governance)
- ప్రధానంగా కేటాయింపులను వీటికే పరిమితం చేశారు.
1. ఆరోగ్య రంగం :
- కరోనా నుంచి పాఠాలు నేర్చుకున్న భారత్ 2021-22 తాజా బడ్జెట్ లో 'ఆరోగ్యానికి' పెద్ద పీట వేసింది.
- ఆరోగ్యం - యోగక్షేమాలకు ఏకంగా రూ. 2,23,000 కోట్లు కేటాయించారు. ఇది 'జీడీపీ' లో 1.8 శాతానికి సమానం.
- గత బడ్జెట్ తో పోలిస్తే ఈ మొత్తం 137 శాతం అధికం.
క్లుప్తంగా ...
| రంగం | కేటాయింపులు |
| ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ | రూ. 71,268 కోట్లు |
| కొవిడ్ టీకాలు | రూ. 35,000 కోట్లు |
| ప్రధానమంత్రి ఆత్మనిర్భర్ స్వస్థ్ భారత్ యోజన | రూ. 64,180 కోట్లు |
| ఆయుష్ (ఆయుర్వేద, యునాని, హోమియో) | రూ. 2,970.30 కోట్లు |
| ఆరోగ్య పరిశోధనల విభాగం | రూ. 2,663 కోట్లు |
ప్రధానమంత్రి ఆత్మనిర్భర్ స్వస్థ్ భారత్ యోజన :
- ఈ పథకం కోసం ఆరేళ్ల కాలానికిగాను రూ. 64,180 కోట్లు కేటాయించారు.
- ప్రాథమిక, ద్వితీయ, తృతీయ స్థాయి ఆరోగ్య వ్యవస్థల సామర్థ్యాలను మెరుగుపర్చేందుకు .. ప్రస్తుతమున్న జాతీయ స్థాయి సంస్థలను మరింత బలోపేతం చేసేందుకు ఈ కేంద్ర ప్రాయోజిత పథకం దోహదపడనుంది.
- కొత్తగా ప్రబలే వ్యాధులను గుర్తించి, చికిత్స అందించేందుకుగాను నూతన సంస్థలను ఏర్పాటు చేసేందుకూ ఈ పథకం కింద నిధులు కేటాయిస్తారు.
- 'జాతీయ ఆరోగ్య మిషన్' కు అదనంగా ఈ పథకం అమలు కానుంది.
న్యూమోకోకల్ టీకా (PNEUMOCOCCAL VACCINE) :
- ప్రస్తుతం ఐదు రాష్ట్రాలకే పరిమితమైన 'న్యూమోకోకల్ టీకా' పంపిణీని దేశమంతటా విస్తరించనున్నారు.
- న్యూమోనియా, సెప్టికామియా, మెదడువాపు వంటి ప్రాణాంతక ఇన్ఫెక్షన్ల నివారణకు ఈ టీకా ఉపయోగపడుతుంది.
- కేంద్రం తాజా నిర్ణయం దేశంలో ఏటా 50 వేల మంది చిన్నారుల మరణాలను తప్పించేందుకు దోహదపడుతుంది.
2. వ్యవసాయ రంగం :
- వ్యవసాయం, రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖకు 2021-22 కేంద్ర బడ్జెట్ లో కేటాయింపులు 5.63 శాతం మేర పెరిగి, రూ. 1,31,531 కోట్లకు చేరాయి. ఇందులో దాదాపు సగం నిధులను .. కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న 'పీఎం-కిసాన్' (PM KISAN SAMMAN NIDHI) పథకానికి ప్రత్యేకించారు.
- వ్యవసాయ మౌలిక వసతుల నిధి, సాగునీటి కార్యక్రమాలకు కేటాయింపులు పెంచారు.
- పంట కోతల అనంతరం అవసరమయ్యే మౌలిక వసతులను సృష్టించేందుకు 'వ్యవసాయ మౌలిక వసతులు, అభివృద్ధి సెస్' (AIDC) ను విధించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
- 2021-22 ఆర్ధిక సంవత్సరంలో రైతులకు రూ. 16.5 లక్షల కోట్ల రుణాలను ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. (2020-21 లో అది రూ. 15 లక్షల కోట్లుగా ఉంది)
- తమిళనాడులో బహుళ ప్రయోజన 'సీవీడ్ పార్కు' (SEAWEED PARK) ను ఏర్పాటు చేయనున్నారు.
- వ్యవసాయ రంగానికి .. 2020-21 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి సవరించిన బడ్జెట్ అంచనాలు రూ. 1,24,519 కోట్లుగా ఉన్నాయి.
- 2021-22లో వ్యవసాయ శాఖకు చేసిన కేటాయింపుల్లో 'వ్యవసాయం, రైతుల సంక్షేమ విభాగానికి' రూ. 1,23,017.57 కోట్లు కేటాయించారు.
- వ్యవసాయ పరిశోధన, విద్యకు రూ. 8,513.62 కోట్లు ప్రత్యేకించారు.
- 'పీఎం-కిసాన్' (PM KISAN SAMMAN NIDHI) కు రూ. 65 వేల కోట్లు దక్కాయి.
- 'పీఎం-ఆశా' (PM-AASHA) పథకానికి 2020-21కి సంబంధించిన సవరించిన అంచనాలు రూ. 996 కోట్లుగా ఉండగా తాజాగా ఈ పద్దు కింద రూ. 1,500 కోట్లు కేటాయించారు.
- 10వేల వ్యవసాయ ఉత్పత్తి సంస్థల ఏర్పాటు, ప్రోత్సాహానికి కేటాయింపులను రూ. 250 కోట్ల నుంచి రూ. 700 కోట్లకు, వ్యవసాయ మౌలిక వసతుల నిధిని రూ. 208 కోట్ల నుంచి రూ. 900 కోట్లకు పెంచారు.
- 'పీఎం-కే ఎస్ వై' (PM-KSY) కు 2020-21 సవరించిన అంచనాల్లో రూ. 2,563 కోట్ల నుంచి రూ. 4వేల కోట్లకు పెంచారు.
- గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధి నిధిని రూ. 30వేల కోట్ల నుంచి రూ. 40వేల కోట్లకు పెంచారు.
- సూక్ష్మ సాగు నిధికి సంబంధించిన కార్పస్ ను ప్రస్తుతమున్న రూ. 5వేల కోట్ల నుంచి రెట్టింపు చేశారు.
- వ్యవసాయ, అనుబంధ ఉత్పత్తులకు విలువ జోడింపు. వాటి ఎగుమతులకు అవకాశాన్ని పెంచేందుకు "ఆపరేషన్ గ్రీన్స్ స్కీం" (Operation Greens Scheme) ను 22 ఉత్పత్తులకు విస్తరించారు. ప్రస్తుతం అది 'టమోటాలు, ఉల్లిపాయలు, బంగాళా దుంపలు' (TOP) కు వర్తిస్తోంది.
- 'ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్' (eNAM) లో 1.68 కోట్ల మంది రైతులు నమోదయ్యారు. ఈ వేదిక ద్వారా రూ. 1.14 లక్షల కోట్ల విలువైన సరకు వాణిజ్యం జరిగింది. మరో వెయ్యి మండీలను 'ఈనామ్' (eNAM) తో అనుసంధానించనున్నారు.
- మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమాభివృద్ధి శాఖకు కేటాయింపులను రూ. 3,918.31 కోట్ల నుంచి రూ. 4,820.82 కోట్లకు పెంచారు.
- ఆహార శుద్ధి పరిశ్రమల మంత్రిత్వ శాఖ కేటాయింపులు రూ. 1,247.42 కోట్ల నుంచి రూ. 1,308.66 కోట్లకు పెరిగాయి.
- అన్నదాతల ఆదాయాన్ని రెండు రెట్లు చేయడంలో భాగంగా దేశవ్యాప్తంగా 5 వ్యవసాయ హబ్ లను ఏర్పాటు చేస్తారు.
- రైతులకు రూ. 16,50,000 కోట్లు వ్యవసాయ రుణాలుగా ఇవ్వాలని నిర్ణయించారు.
- రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడానికి దేశంలో 1,000 వ్యవసాయ మార్కెట్ల (మండీ) ను 'ఈ-నామ్' (eNam) తో అనుసంధానిస్తారు.
3. విద్యా రంగం :
- 'జాతీయ విద్యా విధానం' అమల్లో భాగంగా వ్యాయామోపాధ్యులు (PET), సంగీతం, కళలు, చిత్రలేఖనం తదితర ఉపాధ్యాయులను నియమించడంతోపాటు, ప్రయోగశాలలు, గ్రంథాలయాలను ఏర్పాటు చేయడం ద్వారా దేశంలోని 15,000 పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందిస్తారు. అవి దేశవ్యాప్తంగా ఉన్న మిగిలిన పాఠశాలలకు 'మెంటార్' (MENTOR) గా వ్యవహరిస్తాయి.
- దేశవ్యాప్తంగా కొత్తగా 100 సైనిక పాఠశాలలను ఎన్ జీ ఓ సంస్థలు, ప్రైవేట్ పాఠశాలలు, రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో ఏర్పాటు చేస్తారు.
- ఉన్నత విద్యలో విదేశీ విద్యా సంస్థలను ప్రోత్సహిస్తూనే .. వాటిలో బహుళ డిగ్రీలు, గిరాకీ ఉన్న కోర్సులకు అనుమతులు ఇచ్చేందుకు, వాటి పర్యవేక్షణకు ఓ వ్యవస్థను ఏర్పాటు చేస్తారు.
- 'జాతీయ పరిశోధన సంస్థ' (NRF) కార్యకలాపాలకు ఐదేళ్లలో రూ. 50 వేల కోట్లు ఖర్చు చేస్తారు.
- గిరిజన విద్యార్థుల కోసం ఆయా వర్గాలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో కొత్తగా 750 'ఏకలవ్య గురుకుల పాఠశాలలు' ఏర్పాటు చేస్తారు.
విద్యా శాఖకు ఇచ్చింది మొత్తం రూ. 93,224.31 కోట్లు
| రంగం | కేటాయింపులు |
| పాఠశాల విద్య | రూ. 54,873.66 కోట్లు |
| ఉన్నత విద్య | రూ. 38,350.65 కోట్లు |
- విద్యా రంగ కేటాయింపుల్లో భాగంగా 'కేంద్రీయ విద్యాలయాలకు రూ. 6,800 కోట్లు, నవోదయ విద్యాలయాలకు రూ. 3,800 కోట్లు, మధ్యాహ్న భోజన పథకానికి రూ. 11,500 కోట్లు' కేటాయించారు.
- ప్రపంచ స్థాయి విద్యాసంస్థలుగా మార్చాలన్న లక్ష్యంతో దేశవ్యాప్తంగా 10 ప్రభుత్వ శ్రేష్ఠతర విద్యాసంస్థలను ఎంపిక చేసి, వాటికి రూ. 1,710 కోట్లు ఖర్చు చేస్తారు.
- కళాశాలలు, వర్సిటీల్లోని విద్యార్థుల ఉపకార వేతనాల కోసం రూ. 207 కోట్లు ఖర్చు చేస్తారు.
4. రైల్వే బడ్జెట్ :
- కేంద్ర ఆర్థికశాఖా మంత్రి 'నిర్మలా సీతారామన్' 2021 ఫిబ్రవరి 1న రూ. 1.10 లక్షల కోట్లతో "రైల్వే బడ్జెట్" (Railway Budget) ను ప్రవేశపెట్టారు. ఇందులో రూ. 1.07 లక్షల కోట్లు 'మూల ధన వ్యయం'. "జాతీయ రైల్వే ప్రణాళిక - 2030" (NATIONAL RAILWAY PLAN 2030) ను దృష్టిలో పెట్టుకుని ఈ కేటాయింపులు జరిపారు.
- 'భారత్ లో తయారీ' (MADE IN INDIA) కార్యక్రమంలో భాగంగా పరిశ్రమలకు రవాణా చార్జీలు భారీగా తగ్గించే లక్ష్యంతో 'సరకు రవాణా కారిడార్లు' (DFC) ఏర్పాటు చేస్తారు.
- 2022 నాటికి తూర్పు, పశ్చిమ కారిడార్లు సిద్ధం కానున్నాయి. "సోనెనగర్ - గోమో" మధ్య 263 కిలోమీటర్ల తూర్పు కారిడార్ లో కొంతమేర ఈ ఏడాది పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యంతో చేపడతారు. అలాగే "గోమో - థాంకుని" మధ్య 274 కిలోమీటర్ల మేర మొదలు అవుతుంది.
"ఖరగ్ పుర్ - విజయవాడ, ఇటార్సి - విజయవాడ" సరకు రవాణా కారిడార్లు :
- 'ఈస్ట్ కోస్ట్ కారిడార్' లో భాగంగా ఖరగ్ పుర్ నుంచి విజయవాడ, 'ఈస్ట్ వెస్ట్ కారిడార్' లో భాగంగా భుసవాల్ - ఖరగ్ పుర్ - థాంకుని, 'నార్త్ సౌత్ కారిడార్' లో భాగంగా ఇటార్సి నుంచి విజయవాడ వరకు సరకు రవాణా కారిడార్లు భవిష్యత్తు అవసరాల కోసం సిద్ధం చేయనున్నారు.
బ్రాడ్ గేజ్ విద్యుదీకరణ :
- బ్రాడ్ గేజ్ మార్గం విద్యుదీకరణ ఈ ఏడాది చివరి నాటికి 72% మేరకు అంటే 46,000 కిలోమీటర్లకు చేరుకుంటుంది.
- గత ఏడాది అక్టోబర్ నాటికి 41,548 కిలోమీటర్ల మేర పూర్తయింది.
- 2023 చివరినాటికి మొత్తం విద్యుదీకరణ పూర్తవుతుంది.
ప్రయాణికుల భద్రత :
- ప్రయాణికుల భద్రత దృష్ట్యా 'ఎల్ హెచ్ బీ' (LHB) కోచ్ లను ప్రవేశపెట్టనున్నారు.
- రద్దీ ఎక్కువగా ఉండే మార్గాల్లో ఆటోమేటిక్ గా గుర్తించే ఆధునిక సాంకేతిక వ్యవస్థను ప్రవేశపెడతారు. దీనివల్ల మానవతప్పిదాల కారణంగా రైళ్లు ఎదురెదురుగా వచ్చి ఢీకొనే ప్రమాదాలు తప్పుతాయి.
- పర్యాటక ప్రాంతాల్లో 'విస్టాడోమ్' (VISTADOME) కోచ్ లను ప్రవేశపెడతారు.
'నూతన భారతం - నూతన రైల్వే' విధానం :
- ఈ విధానం కింద రైల్వే రంగంలో 150 ఆధునిక రైళ్లను ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు చేపట్టిన టెండర్ల ప్రక్రియ 2021 మే నెల నాటికి పూర్తికానుంది.
- 2021 జనవరి 8 నాటికి 'కిసాన్ రైళ్లు' 120 ట్రిప్పులు తిరిగి 34 వేల టన్నుల సరకులు రవాణా చేశాయి.
- 'కరోనా' కారణంగా రైళ్ల సేవలను నిలిపి వేయడంతో టైమ్ టేబుల్ ఆధారంగా నడిచే ప్రత్యేక పార్శిల్ సేవల రైళ్లను నడిపారు. ఇలాంటి ప్రయోగం చేయడం ఇదే ప్రథమం. దీనివల్ల కొరియర్, ఈ-బిజినెస్ సంస్థలు లబ్ది పొందాయి.
- గూడ్సు రైళ్ల కోసం ప్రత్యేకంగా నిర్మిస్తున్న లైన్లు (DFC) పూర్తయితే వాటి వేగం గంటకు 76 కి.మీ వరకు ఉంటుంది.
5. పెట్టుబడుల ఉపసంహరణ :
- వచ్చే ఆర్ధిక సంవత్సరం (2021-22) లో ప్రభుత్వరంగ సంస్థల నుంచి పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ. 1,75,000 కోట్లు సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
- గత ఆర్ధిక సంవత్సరం (2020-21) లో రూ. 2,10,000 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా నిర్దేశించుకోగా కొవిడ్-19, ఇతర అవాంతరాలవల్ల ఆ లక్ష్యాన్ని రూ. 32,000 కోట్లకు కుదించారు. అందులో ఇప్పటివరకు రూ. 19,499 కోట్లే సమీకరించగలిగారు.
- బీపీసీఎల్, ఎయిర్ ఇండియా, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, కంటైనర్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా, ఐడీబీఐ బ్యాంకు, బీఈఎంఎల్, పవన్ హన్స్, నీలాచల్ ఇస్పాత్ నిగమ్ .. తదితర ప్రభుత్వరంగ సంస్థలలో వాటా విక్రయాలను 2021-22 ఆర్ధిక సంవత్సరంలో చేపట్టనున్నారు.
- ఐడీబీఐ (IDBI) బ్యాంకుతో పాటు రెండు ప్రభుత్వ బ్యాంకులు, ఒక సాధారణ బీమా కంపెనీని ప్రైవేటీకరిస్తారు.
ఎయిర్ ఇండియా విక్రయం :
- ఎయిర్ ఇండియా (AIR INDIA) లో పెట్టుబడుల విక్రయాన్ని 2021-22లో పూర్తిచేయనున్నట్లు ఆర్ధిక మంత్రి వెల్లడించారు. దీనికోసం ఏర్పాటు చేసిన 'ప్రత్యేక సంస్థ' (SPV), ఎయిర్ ఇండియా అస్సెట్ హోల్డింగ్స్ లిమిటెడ్ కు రూ. 2,268 కోట్లు కేటాయిస్తారు.
వచ్చే ఆర్ధిక సంవత్సరంలో 'ఎల్ ఐ సీ' ఐపీవో :
- ఎల్ ఐ సీ ఐపీవో కోసం చట్ట సవరణను పార్లమెంటు సమావేశాల్లో చేపడతారు.
- ఎల్ ఐ సీ 'తొలి పబ్లిక్ ఇష్యూ' (IPO) 2021-22లో కార్యరూపం దాల్చనుంది.
- ఎల్ ఐ సీ లో ప్రస్తుతం నూరుశాతం వాటా కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది. ఐపీవో ద్వారా ప్రభుత్వం 10 శాతం వాటా విక్రయించే అవకాశం ఉంది.
6. ఇతర అంశాలు :
(a) వ్యక్తిగత ఆదాయ పన్ను :
- వ్యక్తిగత ఆదాయ పన్ను రేట్లతో పాటు, సర్ ఛార్జి, సెస్సుల్లో ఈసారి ఎలాంటి మార్పులు ప్రతిపాదించలేదు.
- ప్రస్తుతం రూ. 2 కోట్ల నుంచి రూ. 5 కోట్ల ఆదాయం ఉన్న వ్యక్తులు, హెచ్ యూ ఎఫ్ (HUF) లు 25 శాతం, ఆపైన ఆదాయం ఉంటే 37 శాతం సర్ ఛార్జి చెల్లించాలి. దీనివల్ల రూ. 5 కోట్లకు పైగా ఆదాయం ఉన్న వ్యక్తులు గరిష్ఠంగా 42.74 శాతం పన్ను చెల్లించాల్సి వస్తోంది.
ఆర్ధిక సంవత్సరం 2021-22 (మదింపు సంవత్సరం 2022-23) కు సంబంధించి వర్తించే శ్లాబులు ... (వివిధ సెక్షన్ల కింద మినహాయింపులను వాడుకున్నప్పుడు)
| ఆదాయం | 60 ఏళ్ల లోపు వారికి | 60-80 ఏళ్ల వారికి | 80 ఏళ్లు ఆపై వయసున్న వారికి |
| రూ. 2,50,000 వరకు | పన్ను లేదు | పన్ను లేదు | పన్ను లేదు |
| రూ. 2,50,001-రూ. 3,00,000 | 5% | పన్ను లేదు | పన్ను లేదు |
| రూ. 3,00,001-రూ. 5,00,000 | 5% | 5% | పన్ను లేదు |
| రూ. 5,00,001-రూ. 10,00,000 | 20% | 20% | 20% |
| రూ. 10 లక్షల పైన | 30% | 30% | 30% |
ఆర్ధిక సంవత్సరం 2021-22 (మదింపు సంవత్సరం 2022-23) కు సంబంధించి వర్తించే శ్లాబులు ... (వివిధ సెక్షన్ల కింద ఎలాంటి మినహాయింపులను వాడుకోనప్పుడు)
| ఆదాయం | వర్తించే శ్లాబులు |
| రూ. 2,50,000 వరకు | పన్ను లేదు |
| రూ. 2,50,001-రూ. 5,00,000 వరకు | 5% |
| రూ. 5,00,001-రూ. 7,50,000 వరకు | 10% |
| రూ. 7,50,001-రూ. 10,00,000 వరకు | 15% |
| రూ. 10,00,001-రూ. 12,50,000 వరకు | 20% |
| రూ. 12,50,001-రూ. 15,00,000 వరకు | 25% |
| రూ. 15,00,001 ఆపైన | 30% |
(b) బీమా రంగానికి విదేశీ ఊతం :
- దేశీయ బీమా కంపెనీల్లో ప్రస్తుతం 49 శాతం విదేశీ పెట్టుబడికి అనుమతి ఉంది. దీన్ని 74 శాతానికి పెంచుతున్నట్లు ఆర్ధిక మంత్రి బడ్జెట్ లో ప్రకటించారు.
- బీమా కంపెనీల్లోని బోర్డు సభ్యులు, కీలక ఉద్యోగుల్లో ఎక్కువ మంది భారతీయులై ఉండాలని నిర్దేశించారు.
- బీమా కంపెనీల లాభాల్లో నిర్దేశించిన శాతాన్ని 'జనరల్ రిజర్వు' కు మళ్లించాలని స్పష్టం చేశారు.
- ప్రస్తుతం దేశంలో బీమా విస్తృతి జీడీపీ (GDP) లో 3.6 శాతమే. ప్రపంచ సగటు 7.13 శాతం.
- సాధారణ బీమాలో బీమా విస్తృతి ప్రపంచ సగటు 2.88 శాతం కాగా .. మనదేశంలో 'జీడీపీ' లో 0.94 శాతంగా ఉంది.
- ప్రస్తుతం ప్రైవేటు రంగంలో 23 జీవిత బీమా కంపెనీలు, 28 సాధారణ బీమా / ఆరోగ్య బీమా కంపెనీలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ప్రభుత్వరంగంలో 'ఎల్ ఐ సీ' ఒక్కటే జీవిత బీమా సంస్థ. ప్రభుత్వరంగ సాధారణ బీమా కంపెనీలు 4 ఉన్నాయి.
(c) ప్రభుత్వరంగ బ్యాంకులకు మరో రూ. 20,000 కోట్లు :
- నియంత్రణ సంస్థల నిబంధనలు చేరుకునేందుకు వీలుగా ప్రభుత్వరంగ బ్యాంకు (PSB) ల్లోకి 2021-22లో మరో రూ. 20,000 కోట్ల నిధుల్ని చొప్పించనున్నట్లు ఆర్ధిక మంత్రి తెలిపారు.
(d) 'దేశమే ముందు' సంకల్పానికి అష్టపది :
- 2021-22 బడ్జెట్ కు ఎనిమిది ప్రాధాన్య రంగాలను గుర్తించినట్లు ఆర్థిక మంత్రి చెప్పారు. 'దేశమే ముందు' అనే సంకల్పంలో ఇది భాగమని ప్రకటించారు. ఆయా రంగాలు :
- రైతుల ఆదాయం రెట్టింపు
- బలమైన మౌలిక సదుపాయాలు
- ఆరోగ్య భారత్
- సుపరిపాలన
- యువతకు అవకాశాలు
- అందరికీ విద్య
- సమ్మిళిత వృద్ధి
- ఆరోగ్య రంగం
- అన్ని జిల్లాల్లో సమీకృత ఆరోగ్య ప్రయోగశాలలు. 202 జిల్లాల్లో క్లిష్టతర చికిత్స ఆసుపత్రులు ఏర్పాటు చేస్తారు.
- ఆరోగ్య పరిరక్షణకు జాతీయస్థాయిలో ఒక సంస్థను ఏర్పాటు చేస్తారు.
(e) ఉజ్వల :
- 'ఉజ్వల' (UJWALA) పథకం కింద మరో కోటి ఉచిత వంట గ్యాస్ కనెక్షన్లు ఇస్తారు.
- వాహనాలకు 'సీ ఎన్ జీ' (CNG) సరఫరా చేస్తారు.
- ఇళ్లకు పైప్ లైన్ ద్వారా వంట గ్యాస్ సదుపాయాన్ని మరో 100 జిల్లాలకు విస్తరిస్తారు.
- 'గెయిల్, ఐఓసీ, హెచ్ పీ సీ ఎల్' పైపులైన్ల 'నగదీకరణకు అనుమతిస్తారు. అంటే వాటిని ఇతర కంపెనీల అవసరాలకూ వాడుకుని ఆదాయాన్ని ఆర్జించేందుకు అవకాశం కల్పిస్తారు.
(f) ఇతర దేశాలకు రూ. 7,100 కోట్లు :
- పొరుగు దేశాలతో పాటు ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలకు రూ. 7,100 కోట్లు ఇవ్వనున్నారు. ఇందులో భూటాన్ కు రూ. 3,004 కోట్లు కేటాయించారు. ఇరాన్ లో 'చాబహార్' నౌకాశ్రయానికి రూ. 100 కోట్లు ఇచ్చారు.
(g) గిగ్ కార్మికులకు సామాజిక భద్రత :
- ఊబర్, స్విగ్గీ లాంటి రవాణా, సరకు సరఫరా సంస్థల్లో పనిచేసే కార్మికులకు సామాజిక భద్రత ప్రయోజనాలను విస్తరించనున్నారు. గిగ్, ప్లాట్ ఫామ్ కార్మికులుగా పేర్కొంటున్న వీరి సమాచారాన్ని సేకరించి పోర్టల్ రూపొందించేందుకు ప్రతిపాదిస్తున్నారు. వారికి వైద్యం, ఆహారం, సులభతర రుణాలు, ఇతర ప్రయోజనాలను కల్పించనున్నారు.
(h) ఇతర అంశాలు :
- రక్షణ రంగానికి రూ. 4,78,196 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్ తో పోల్చితే ఇది 1.4 శాతం అధికం.
- 'స్వచ్ఛ భారత్ - స్వాస్థ్య భారత్' కార్యక్రమానికి రూ. 1,90,000 కోట్లు కేటాయించారు.
- మౌలిక సదుపాయాలపై రూ. 5,54,000 కోట్లు మూలధన వ్యయం చేయనున్నారు.
- పట్టణ ప్రాంతాల కోసం ఐదేళ్లలో రూ. 2,87,000 కోట్లతో 'జల్ జీవన్ మిషన్' కార్యక్రమాన్ని చేపడతారు.
- తాగునీటి సరఫరాకు ఉద్దేశించిన 'జల్ జీవన్ మిషన్' కు రూ. 50,000 కోట్లు కేటాయించారు.
- జల్ శక్తి మంత్రిత్వ శాఖ పరిధిలోని 'తాగునీరు, పారిశుద్ధ్య' విభాగానికి మొత్తం రూ. 60,030 కోట్లు కేటాయించారు.
- రోడ్డు రవాణా, హైవేల మంత్రిత్వ శాఖకు రూ. 1,18,101 కోట్లను కేటాయించారు. పట్టణ ప్రాంతాల్లో ప్రజారవాణాను మెరుగుపరిచేందుకు రూ. 18,000 కోట్లతో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంలో 20,000 బస్సులను అందుబాటులోకి తెస్తారు.
- పత్తి దిగుమతిపై 10% కస్టమ్స్ సుంకం విధించారు. ముడి పట్టు, పట్టు దారంపై ఉన్న సుంకాన్ని 10% నుంచి 15 శాతానికి పెంచారు.
- పింఛను, డిపాజిట్లపై వడ్డీ పొందుతున్న 75 ఏళ్లు పైబడిన వృద్ధులు పన్ను రిటర్న్స్ ను దాఖలు చేయాల్సిన అవసరం లేకుండా మినహాయింపు ఇచ్చారు. బ్యాంకు ఖాతాల్లోనే వారి పన్ను మొత్తాన్ని మినహాయిస్తారు.
- వచ్చే ఆర్ధిక సంవత్సరం (2021-22) లో ప్రభుత్వం రూ. 12 లక్షల 5 వేల కోట్లు అప్పు చేయనున్నట్లు ఆర్ధిక మంత్రి తెలిపారు.
- ఈసారి బడ్జెట్ ను తొలిసారిగా కాగిత రహిత విధానంలో ప్రవేశపెట్టారు.
- దేశంలో డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు రూ. 1,500 కోట్ల పథకాన్ని ప్రతిపాదించారు.
- ఇంజినీరింగ్, డిప్లొమా, డిగ్రీ కోర్సులు పూర్తి చేసిన వారికి ఉపాధి కల్పించే లక్ష్యంతో అప్రెంటిస్ చట్టాన్ని సవరించడంతోపాటు, జాతీయ అప్రెంటిస్షిప్ శిక్షణ పథకం పునరుజ్జీవానికి చర్యలు చేపట్టారు. ఆయా వర్గాల యువతను నైపుణ్యవంతులుగా తీర్చిదిద్ధేందుకు రూ. 3,000 కోట్లు కేటాయించారు.
- జనగణన కోసం రూ. 3,726 కోట్లను కేటాయించారు. తొలిసారి జనగణను డిజిటల్ రూపంలో చేయనున్నారు.
- దేశంలోని ప్రధాన నౌకాశ్రయాల్లో 'ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య' (PPP) విధానంలో యాజమాన్య నిర్వహణ సేవలు అందించడం కోసం రూ. 2,000 కోట్లకు పైగా విలువ గల 7 ప్రాజెక్టులను చేపట్టనున్నారు. వాణిజ్య నౌకలను ప్రోత్సహించేందుకు రానున్న ఐదేళ్లలో రూ. 1,624 కోట్ల రాయితీ ఇవ్వనున్నారు.
- ఈ ఆర్ధిక సంవత్సరం (2021-22) లో ఉపాధి హామీ పథకానికి రూ. 73,000 కోట్లను కేటాయించారు.
- 2021-22 ఆర్ధిక సంవత్సరంలో ఆహారం, ఎరువులు, ఎల్ పీ జీ, కిరోసిన్ పై రాయితీ మొత్తాన్ని రూ. 3,36,439 కోట్లకు పరిమితం చేశారు.
- అధిక వేతనం ఉన్న ఉద్యోగులు 'భవిష్య నిధి' (PF) ఖాతాల్లో జమ చేసే మొత్తంపై ఆర్జించే వడ్డీకి ఈ బడ్జెట్ లో కొత్త నిబంధనలు ప్రతిపాదించారు. దీని ప్రకారం .. ఇకపై రూ. 2,50,000 వరకు జమ చేసే మొత్తంపై వచ్చే వడ్డీకే పన్ను మినహాయింపు లభిస్తుంది. ఆపై జమ చేసే మొత్తానికి లభించే వడ్డీకి వర్తించే స్లాబుల ప్రకారం పన్ను విధిస్తారు. ఇది 2021 ఏప్రిల్ 1 నుంచి చేసే జమలకే వర్తిస్తుంది.
- ఆర్ధిక ఇబ్బందులతో కునారిల్లుతున్న విద్యుత్తు పంపిణీ సంస్థలకు నూతన జవసత్వాలు అందించడమే లక్ష్యంగా రానున్న ఐదేళ్లలో రూ. 3 లక్షల 5 వేల కోట్లు వెచ్చించనున్నారు.
- మహిళా, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖకు రూ. 24,435 కోట్లు కేటాయించారు. ఇందులో అత్యధికంగా రూ. 20,105 కోట్లు 'సక్షం అంగన్వాడీ, మిషన్ పోషణ్ 2.0' కు కేటాయించారు.
- ప్రస్తుతం 9.5 శాతానికి పెరిగిన ద్రవ్యలోటును 2025-26 నాటికి 4.5% కంటే దిగువకు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
- రూ. 75,000 కోట్లతో 'అభివృద్ధి ఆర్ధిక సంస్థ' ను ఏర్పాటు చేస్తారు.
- గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధి నిధికి రూ. 40,000 కోట్లు కేటాయించారు.
- ఐదు ప్రధాన ఫిషింగ్ హబ్ ల అభివృద్ధికి ప్రకటించిన 'ఆపరేషన్ గ్రీన్' (OPERATION GREEN) పథకాన్ని మరో 22 పాడైపోయే వస్తువులకూ వర్తింపజేస్తారు.
- అంతరిక్ష రంగానికి రూ. 13,949 కోట్లు కేటాయించారు. కొత్తగా ఏర్పాటయిన 'న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్' (NEW SPACE INDIA LIMITED) సంస్థకు రూ. 700 కోట్లు కేటాయించారు.
- పర్యాటక రంగానికి రూ. 2,026 కోట్లు కేటాయించారు.
- వలస కార్మికుల కోసం పట్టణాల్లో తక్కువ అద్దెకే ఇళ్లు నిర్మించేవారిని ప్రోత్సహిస్తారు. ఈ ఇళ్ల నిర్మాణానికి తీసుకున్న రుణంపైనా రూ. 1,50,000 వడ్డీ రాయితీ ఉంది. ఇది 2022 మార్చ్ 31 వరకు అమల్లో ఉంటుంది.
- మధ్య తరగతి ప్రజలకు ఉపయోగపడే 'పీఎంఏవై' (PMAY) పథకాన్ని మరో ఏడాది పొడిగించారు. అందుబాటు ధరల్లో గృహాలు నిర్మించే సంస్థలకు పన్ను విరామం ను మరో ఏడాది పొడిగించారు.
- విదేశాల నుంచి ప్రవాస భారతీయులు తిరిగి వచ్చేసినపుడు ఆయా దేశాలతోపాటు ఇక్కడా ఆదాయ పన్ను చెల్లించాల్సి వస్తోంది. ఇది సమస్యలకు దారి తీస్తుండడంతో 'వివాద పరిష్కార కమిటీ' ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
- విదేశాల నుంచి దిగుమతి చేసుకునే 'ఇంక్ కాట్రిడ్జ్, సెల్ ఫోన్ విడిభాగాలైన కెమెరా, కనెక్టర్లు, బ్యాక్ కవర్, ఛార్జర్లు' పై కస్టమ్స్ సుంకం పెంచనున్నారు.
- దేశీయ వస్త్ర పరిశ్రమకు ఊతమిచ్చి ప్రపంచస్థాయిలో పోటీపడే వాతావరణం కల్పించేందుకు, ఉపాధి అవకాశాల మెరుగుకు .. దేశవ్యాప్తంగా రాబోయే మూడేళ్లలో 7 మెగా టెక్స్ టైల్ పార్క్ ల ఏర్పాటుకు ప్రత్యేక పథకాన్ని (MITRA) ప్రకటించారు.
- గతేడాది కిరోసిన్ పై రూ. 2,982 కోట్లు రాయితీ ఇవ్వగా .. ఈ ఏడాది ఏవిధమైన కేటాయింపులు చేయలేదు.
- విమానాల లీజింగ్ కంపెనీలకు పన్ను మినహాయింపు ఇవ్వాలని ప్రతిపాదించారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి