ఆత్మ నిర్భర్ భారత్ - మూడో విడత
(ATMANIRBHAR BHARAT - 3RD TRANCHE)
- 'కరోనా' (CORONA) ను జయించడంతోపాటు అన్ని రంగాల్లో స్వావలంబన సాధించడం మన లక్ష్యం కావాలని భారత ప్రధాని 'నరేంద్ర మోదీ' 2020 మే 12 న "రూ. 20 లక్షల కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీ" ని ప్రకటించారు. దీనిలో భాగంగా భారత ఆర్ధిక మంత్రి 'నిర్మలా సీతారామన్' 2020 మే 15 న "ఆత్మ నిర్భర్ భారత్" - మూడో విడత (రూ. 1,63,343 కోట్లు) ను ప్రకటించారు.
- ఆత్మ నిర్భర్ భారత్ పథకం మూడో విడతలో భాగంగా " వ్యవసాయం, దాని అనుబంధ రంగాల బలోపేతం కోసం" పలు పథకాలను ప్రకటించారు.
'ఆత్మ నిర్భర్ భారత్' - మూడో విడతలో మొత్తం 11 అంశాలు ఉన్నాయి :
| వ.సం | వివిధ రంగాల వివరాలు | అంశాలు |
|---|---|---|
| 1 | మౌలిక వసతుల కల్పనకు సంబంధించినవి | 8 |
| 2 | చట్ట సవరణలకు సంబంధించినవి | 3 |
1. వ్యవసాయ మౌలిక వసతుల కల్పన నిధి (రూ. 1,00,000 కోట్లు)
- ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, రైతు ఉత్పత్తి సంఘాలు, వ్యవసాయ పరిశ్రమలు, స్టార్ట్ అప్ ల ద్వారా గిడ్డంగులు, పంటల శుద్ధి వంటి ప్రాథమిక సౌకర్యాలు కల్పించడానికి రూ. లక్ష కోట్లతో "వ్యవసాయ మౌలిక వసతుల కల్పన నిధి" ని ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది.
- ప్రస్తుతం రైతుల నుంచి ఉత్పత్తులు కొనుగోలు చేసి, వాటికి విలువను జోడించి అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేయడానికి ఇప్పుడు తగిన మౌలిక వసతులు లేవు. ఆ లోపాన్ని సరిదిద్దడం కోసమే త్వరలో ఈ నిధిని ఏర్పాటు చేయనుంది.
- ఈ నిధులను "నాబార్డ్" (NABARD) సేకరిస్తుంది.
2. సూక్ష్మ ఆహార పరిశ్రమల క్రమబద్ధీకరణ (రూ. 10,000 కోట్లు)
- సూక్ష్మ ఆహార పరిశ్రమలకు తగిన బ్రాండింగ్, మార్కెటింగ్ కల్పించడానికి రూ. 10 వేల కోట్లతో కొత్త పథకాన్ని అమలు చేయనున్నారు.
- దీనివల్ల ఈ రంగంలో ఉన్న సుమారు 2 లక్షల పరిశ్రమలకు లబ్ది కలగనుంది. ఉదాహరణకు 'ఉత్తరప్రదేశ్ లో మామిడి, జమ్మూ-కాశ్మీర్ లో కుంకుమ పువ్వు, తెలంగాణ లో పసుపు, ఆంధ్రప్రదేశ్ లో మిరప, ఈశాన్య రాష్ట్రాల్లో వెదురు" ఉత్పత్తులకు ప్రసిద్ధి. కాబట్టి ఈ రాష్ట్రాల్లో ఆయా క్లస్టర్లు ఏర్పాటు చేసి బ్రాండింగ్ కల్పిస్తారు. ఈ ఉత్పత్తుల నాణ్యతా ప్రమాణాలు పెంచుతారు.
- "స్థానికతకు మద్దతుగా గళం" (VOCAL FOR LOCAL) అన్న నినాదంలో భాగంగా ఈ పరిశ్రమలను ప్రోత్సహించనున్నారు.
3. మత్స్య సంపద యోజన (రూ. 20,000 కోట్లు)
- చేపల మార్కెటింగ్ లో ఉన్న లోపాలను సరిదిద్దడానికి రూ. 20 వేల కోట్లతో "ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన" ను ప్రారంభించనున్నారు.
- ఇందులో రూ. 11 వేల కోట్లు 'సముద్ర, మంచి నీటి చేపల పెంపకం, ఆక్వా కల్చర్' రంగాలకు కేటాయిస్తారు.
- రూ. 9 వేల కోట్లు ఫిషింగ్ హార్బర్లు, శీతల గిడ్డంగులు, మార్కెట్ల కోసం ఖర్చు చేస్తారు.
- కేజ్ కల్చర్, సీవీడ్ ఫార్మింగ్, రంగుల చేపల పెంపకం, చేపలు పట్టే పడవల నిర్మాణం, ప్రయోగశాలల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇస్తారు.
- చేపల వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఆర్ధిక సాయం అందిస్తారు.
- వ్యక్తులు, పడవలకు బీమా సౌకర్యం కల్పిస్తారు.
- దీనివల్ల వచ్చే ఐదేళ్లలో చేపల ఉత్పత్తి అదనంగా 70 లక్షల టన్నుల మేర పెరుగుతుందని అంచనా.
- 55 లక్షల మందికి ఉపాధి లభించడమే కాకుండా ఎగుమతులు రెట్టింపై రూ. లక్ష కోట్లకు చేరుతాయి.
4. పశు రోగ నియంత్రణ కార్యక్రమం (రూ. 13,343 కోట్లు)
- పాడి పశువుల్లో ప్రధానంగా కనిపించే గాలికుంటు, నీలి నాలుక వ్యాధుల నివారణకు రూ. 13,343 కోట్లతో "జాతీయ పశు రోగ నివారణా కార్యక్రమం" చేపడతారు.
- ఈ కార్యక్రమం ద్వారా పాడి పశువులు, గొర్రెలు, మేకలు, పందులకు 100% మేర టీకాలు వేస్తారు.
5. పాడి పరిశ్రమ మౌలిక వసతుల కల్పన అభివృద్ధి నిధి (రూ. 15,000 కోట్లు)
- పాడి, పాల ఉత్పత్తులు, పశువుల దాణా తయారీకి అవసరమైన మౌలిక వసతుల కల్పన కోసం రూ. 15 వేల కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తారు.
- ప్రైవేట్ పెట్టుబడులను, ఎగుమతులను ప్రోత్సహిస్తారు.
6. ఔషధ పంటలకు ప్రోత్సాహం (రూ. 4,000 కోట్లు)
- దేశంలో వచ్చే రెండేళ్లలో 10 లక్షల హెక్టార్లలో ఔషధ పంటల సాగును చేపట్టడానికి వీలుగా "జాతీయ ఔషధ మొక్కల బోర్డు" ద్వారా రూ. 4 వేల కోట్ల ప్రోత్సాహం అందించనున్నారు.
- ప్రస్తుతం 2.25 లక్షల హెక్టార్లలో జరుగుతున్న ఈ సాగును వచ్చే రెండేళ్లలో 10 లక్షల హెక్టార్ల స్థాయికి తీసుకెళ్లడం లక్ష్యం.
- దీనివల్ల రైతులకు రూ. 5 వేల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా.
- ఇందుకోసం ప్రాంతీయ మార్కెట్ల నెట్వర్క్ ను ఏర్పాటు చేయనున్నారు.
- గంగా నది ఒడ్డున ఇరువైపులా 800 హెక్టార్ల పరిధిలో ఔషధ మొక్కలు పెంచనున్నారు.
7. తేనెటీగల పెంపకం (రూ. 500 కోట్లు)
- గ్రామీణ ప్రాంత రైతులు, మహిళల జీవనోపాధికి రూ. 500 కోట్లతో తేనెటీగల పెంపకం, మార్కెటింగ్ ను కేంద్రం ప్రోత్సహించనుంది.
- తేనెతో పాటు, మైనం లాంటి ఉత్పత్తులపైనా దృష్టి సారించనుంది.
- దీనివల్ల 2 లక్షల మందికి ఆదాయం పెరగనుంది.
8. కూరగాయల రవాణా, నిల్వలపై రాయితీలు (రూ. 500 కోట్లు)
- ఇప్పటి వరకు టమాటా, ఉల్లి, ఆలూ (బంగాళాదుంప) రవాణా, నిల్వల చార్జీలపై ఇస్తున్న 50 శాతం రాయితీ పథకాన్ని ఇకమీదట అన్ని రకాల కూరగాయలకు విస్తరింపజేస్తారు.
- రూ. 500 కోట్లతో "టాప్ టు టోటల్" ('టాప్' అంటే "టమాటా, ఆనియన్ - ఉల్లి, పొటాటో - బంగాళాదుంప" అని అర్థం) పథకాన్ని అమలు చేయనున్నారు.
- ఇకమీదట సరకు అధికంగా ఉన్నచోట నుంచి కొరత ఉన్న మార్కెట్లకు కూరగాయలు తరలించేందుకు అయ్యే ఖర్చులో 50 శాతం రాయితీ ఇస్తారు.
- శీతల గిడ్డంగితో సహా ఎక్కడ నిల్వ చేసుకున్నా దానిపై అయ్యే ఖర్చులో 50 శాతం తగ్గింపునిస్తారు.
- తొలుత ఈ పథకాన్ని 6 నెలలపాటు ప్రయోగాత్మకంగా అమలు చేసి తర్వాత విస్తరిస్తారు.
9. సరకు నిల్వలపై పరిమితులు ఎత్తివేత (చట్ట సవరణ)
- ఒకప్పుడు ఆహార ధాన్యాల కొరతను అధిగమించేందుకు తెచ్చిన "నిత్యావసర వస్తువుల చట్టం-1955" ని నేటి పరిస్థితులకు అనుగుణంగా సవరించనున్నారు.
- అన్ని రకాల ఆహార వస్తువులు మిగులే ఉంటున్నందున ఇప్పుడు సరకు నిల్వలపై పరిమితులు విధించాల్సిన అవసరం లేదని కేంద్రం భావిస్తోంది.
- చిరుధాన్యాలు, వంటనూనెలు, నూనెగింజలు, పప్పుదినుసులు, ఉల్లి, ఆలూలపై ఇప్పటివరకూ ఉన్న నియంత్రణలను ఎత్తేయాలని కేంద్రం నిర్ణయించింది.
- జాతీయ విపత్తులు, కరువుకాటకాలు, అసాధారణ ధరల పెరుగుదల లాంటి పరిస్థితుల్లో మినహాయించి మిగిలిన సమయాల్లో నిల్వ, ఎగుమతుల మీద పరిమితులు విధించకుండా చట్ట సవరణ చేయనున్నారు.
- ఆహార శుద్ధి పరిశ్రమలు, ఎగుమతిదారుల వద్ద ఉండే నిల్వలపైనా ఎలాంటి పరిమితులు విధించరు.
10. పంట విక్రయాలకు కేంద్రీకృత చట్టం (కొత్త చట్టం)
- రైతు తన పంటను ఏ రాష్ట్రంలోనైనా అమ్ముకునేందుకు వీలుగా వ్యవసాయ మార్కెటింగ్ విధానాన్ని సంస్కరిస్తూ ఒక కేంద్రీకృత చట్టాన్ని తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది.
- అంతర్రాష్ట్రీయ మార్కెట్ అన్నది కేంద్ర పరిధిలోని అంశం కాబట్టి ఆ నిబంధనను ఆసరాగా చేసుకొని ఈ చట్టానికి రూపకల్పన చేస్తున్నట్లు ప్రకటించింది.
- దీనిపై రాష్ట్రాల చట్టాలు ఉన్నా కేంద్ర చట్టమే చెల్లుబాటు అవుతుంది.
11. పంట వేసినప్పుడే ధరకు భరోసా (కొత్త చట్టం)
- రైతులకు పంట వేసేటప్పుడే దాని ధరకు భరోసా ఇచ్చేలా చట్టబద్ధమైన భద్రత కల్పించాలని కేంద్రం నిర్ణయించింది.
- వ్యాపారులు, ఎగుమతిదారులతో ముందుగానే పంటల కొనుగోలు, ధరలపై ఒప్పందం కుదుర్చుకునేందుకు చట్టపరమైన భద్రత కల్పించనుంది.
- దీనివల్ల రైతులకు మార్కెటింగ్ కష్టాలు తప్పుతాయి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి