ఆత్మ నిర్భర్ భారత్ - మొదటి విడత
(ATMANIRBHAR BHARAT - 1ST TRANCHE)
- 'కరోనా' (CORONA) ను జయించడంతోపాటు అన్ని రంగాల్లో స్వావలంబన సాధించడం మన లక్ష్యం కావాలని భారత ప్రధాని 'నరేంద్ర మోదీ' 2020 మే 12 న "రూ. 20 లక్షల కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీ" ని ప్రకటించారు. దీనిలో భాగంగా భారత ఆర్ధిక మంత్రి 'నిర్మలా సీతారామన్' 2020 మే 13 న "ఆత్మ నిర్భర్ భారత్" (స్వయం సమృద్ధ భారత్) (రూ. 5.94 లక్షల కోట్లు) ను ప్రకటించారు.
"ఆత్మ నిర్భర్ భారత్" (స్వయం సమృద్ధ భారత్) - మొదటి విడత :
- 'ఆత్మ నిర్భర్ భారత్' - మొదటి విడత (రూ. 5.94 లక్షల కోట్లు) ను భారత ఆర్ధిక మంత్రి 'నిర్మలా సీతారామన్' 2020 మే 13 న ప్రకటించారు.
- ఆర్ధిక స్వయం సమృద్ధిని సాధించి చూపించే "సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు" (MSME ⇒ MICRO, SMALL & MEDIUM ENTERPRISES) కు 'ఆత్మ నిర్భర్ భారత్' - మొదటి విడతలో ప్రముఖ స్థానం కల్పించారు.
- స్థానిక వస్తు ఉత్పత్తులకు డిమాండ్ సృష్టించడానికి, మార్కెట్ పోటీని తట్టుకొని నిలబడటానికి "సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు" (MSME ⇒ MICRO, SMALL & MEDIUM ENTERPRISES) ఆర్ధిక విస్తృతిని పెంచారు.
'ఆత్మ నిర్భర్ భారత్' - మొదటి విడతలో మొత్తం 16 అంశాలు ఉన్నాయి :
| వ.సం | వివిధ రంగాల వివరాలు | అంశాలు |
|---|---|---|
| 1 | సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (MSME) కోసం | 6 |
| 2 | "పీ ఎఫ్" (PF) రూపంలో ఉద్యోగుల కోసం | 2 |
| 3 | బ్యాంకింగ్ యేతర ఆర్ధిక సంఘాల (NBFC) కోసం | 2 |
| 4 | గుత్తేదారులు - భవన నిర్మాణదారుల కోసం | 2 |
| 5 | ఆదాయపు పన్ను విషయంలో | 3 |
| 6 | డిస్కంల కోసం | 1 |
1. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (MSME)
- మనదేశ 'జీడీపీ' (GDP ⇒ GROSS DOMESTIC PRODUCT) లో మూడో వంతు భాగం మరియు 11 కోట్ల మందికి పైగా ఉపాధి కల్పిస్తున్న రంగం : "సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు" (MSME).
(a) చిన్న వ్యాపారాలకు రూ. 3 లక్షల కోట్ల హామీ లేని రుణాలు :
- 'ఎంఎస్ఎంఈ' (MSME) లు సహా చిన్న వ్యాపారాల కోసం హామీ లేని రూ. 3 లక్షల కోట్ల రుణాలను కేంద్ర ఆర్ధిక మంత్రి ప్రకటించారు.
- ఈ రుణాల వల్ల 45 లక్షల సంస్థలకు ప్రయోజనం దక్కుతుంది. ఉద్యోగాలు తొలగించకుండా కార్యకలాపాలు ప్రారంభించేందుకు వీలవుతుంది.
- ఈ రుణాలను 4 ఏళ్ల గడువుకు ఇస్తారు. 12 నెలలపాటు అసలుపై మారటోరియం ఉంటుంది. వడ్డీ కట్టాల్సిందే.
- 100 శాతం ప్రభుత్వ హామీతో ఈ రుణాలు లభ్యమవుతాయి.
- 2020 అక్టోబర్ 31 వరకు ఈ పథకం అమల్లోకి వస్తుంది.
- హామీ రుసుము ఉండదు. తాజాగా ఎటువంటి హామీ పెట్టనక్కర్లేదు.
- రూ. 25 కోట్ల పెట్టుబడులు, రూ. 100 కోట్ల వరకు టర్నోవర్ ఉన్న చిన్న వ్యాపారులకు ఈ పథకం వర్తిస్తుంది.
(b) ఒత్తిడిలో ఉన్న 'ఎంఎస్ఎంఈ' (MSME) లకు రూ. 20,000 కోట్ల సబ్ ఆర్డినేట్ రుణాలు :
- రుణ ఒత్తిడిలో ఉన్న 'సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు' (MSME) కు రూ. 20,000 కోట్ల సబ్ ఆర్డినేట్ రుణాలు ఇవ్వనున్నారు. అంటే బ్యాంకుల ద్వారా 'ఎంఎస్ఎంఈ' (MSME) ప్రమోటర్లకు రుణాలు ఇస్తారు. ఈ రుణాలను ప్రమోటర్లు ఈక్విటీ రూపంలో కంపెనీలోకి చొప్పిస్తారు.
- దీని వల్ల 2 లక్షల వ్యాపారాలకు ప్రయోజనం దక్కుతుంది.
- నికర నిరర్ధక ఆస్తులుగా మారిన లేదా ఒత్తిడిలో ఉన్న 'ఎంఎస్ఎంఈ' (MSME) లకు వీటిని మంజూరు చేయనున్నారు.
(c) 'ఎంఎస్ఎంఈ' (MSME) లకు ద్రవ్యలభ్యత కోసం రూ. 50,000 కోట్లు :
- ద్రవ్యలభ్యత సమస్యలను ఎదుర్కొంటున్న 'ఎంఎస్ఎంఈ' (MSME) లకు "ఫండ్ ఆఫ్ ఫండ్స్" (FUND OF FUNDS) ను ఏర్పాటు చేస్తారు.
- దీని వల్ల రూ. 50,000 కోట్ల మేర వీటికి ద్రవ్యలభ్యత ప్రయోజనాలు సమకూరుతాయి.
- కంపెనీలు తమ పరిమాణాన్ని, సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ఈ నిధులు ఉపయోగపడతాయి.
- స్టాక్ ఎక్స్ఛేంజీల్లో (STOCK EXCHANGES) నమోదు కావడానికి ఇది ఊతమిస్తుంది.
(d) రూ. 200 కోట్ల లోపు టెండర్లు దేశీయ సంస్థలకే :
- భారత 'ఎంఎస్ఎంఈ' (MSME) లకు విదేశీ కంపెనీల నుంచి సహేతుకం కాని రీతిలో పోటీ ఉంటోంది.
- ఈ నేపథ్యంలో రూ. 200 కోట్ల వరకు ప్రభుత్వ ప్రొక్యూర్ మెంట్ టెండర్లలో విదేశీ కంపెనీలను అనుమతించకుండా, జనరల్ ఫైనాన్సియల్ రూల్స్ (GENERAL FINANCIAL RULES) లో సవరణలు చేపట్టనున్నారు.
- 'ఆత్మ నిర్భర్ భారత్' (స్వయం సమృద్ధ భారత్) దిశగా ఇది ఒక అడుగు కానుంది. 'భారత్ లో తయారీ' కి ఇది ఊతమివ్వనుంది.
- 'ఎంఎస్ఎంఈ' (MSME) లు తమ వ్యాపారాన్ని పెంచుకోవడానికి కూడా ఇది ఉపయోగపడనుంది.
(e) 'ఎంఎస్ఎంఈ' (MSME) ల నిర్వచనం మార్పు :
- 'ఎంఎస్ఎంఈ' (MSME) ల నిర్వచనాన్ని ప్రభుత్వం మార్చింది. తద్వారా ఎక్కువ కంపెనీలు ఈ పరిధిలోకి రావడానికి వీలవుతుంది.
- పెట్టుబడుల పరిమితిని పెంచారు. అదనంగా టర్నోవర్ అర్హతను జత చేశారు.
- ప్రస్తుతం తయారీ, సేవా రంగాలను విడివిడిగా పరిగణిస్తున్నారు. కొత్త నిర్వచనంలో తయారీ, సేవా రంగాలకు ఒకే నిర్వచనం ఇచ్చారు. ఇందుకు అవసరమైన చట్ట సవరణలు చేస్తారు.
ప్రస్తుత అర్హత (ప్లాంట్, మెషినరీలో పెట్టుబడులు)
| వర్గీకరణ | తయారీ రంగాలు | సేవా రంగాలు |
|---|---|---|
| సూక్ష్మ | రూ. 25 లక్షల్లోపు | రూ. 10 లక్షల్లోపు |
| చిన్న | రూ. 5 కోట్ల లోపు | రూ. 2 కోట్ల లోపు |
| మధ్య | రూ. 10 కోట్ల లోపు | రూ. 5 కోట్ల లోపు |
సవరించిన అర్హత (పెట్టుబడులు, వార్షిక టర్నోవరు)
| వర్గీకరణ | తయారీ, సేవల రంగాలు |
|---|---|
| సూక్ష్మ | రూ. కోటి లోపు పెట్టుబడులు, రూ. 5 కోట్లలోపు టర్నోవరు |
| చిన్న | రూ. 10 కోట్లలోపు పెట్టుబడులు, రూ. 50 కోట్లలోపు టర్నోవరు |
| మధ్య | రూ. 20 కోట్లలోపు పెట్టుబడులు, రూ. 100 కోట్లలోపు టర్నోవరు |
(f) ఇతర చర్యలు :
- 'కొవిడ్-19' (COVID-19) కారణంగా 'ఎంఎస్ఎంఈ' (MSME) లకు మార్కెటింగ్, ద్రవ్యలభ్యత విషయంలో సమస్యలు ఎదురవుతున్నాయి. అందువల్ల వాణిజ్య ప్రదర్శనలు, ట్రేడ్ ఫెయిర్స్ స్థానంలో "ఈ-మార్కెట్" లింకేజ్ ను 'ఎంఎస్ఎంఈ' (MSME) లకు తీసుకు రానున్నారు.
- లావాదేవీ ఆధారిత రుణాలను పెంచడానికి ఫిన్ టెక్ ను ఉపయోగించనున్నారు. ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల నుంచి 'ఎంఎస్ఎంఈ' (MSME) వెండర్ల బకాయిల సెటిల్మెంట్ లను ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తుంది.
- 45 రోజుల్లోగా 'ఎంఎస్ఎంఈ' (MSME) లకు ఇవ్వాల్సిన రూ. 1 లక్ష కోట్ల బకాయిలను ఇవి విడుదల చేస్తాయి.
2. "పీ ఎఫ్"(PF) రూపంలో ఉద్యోగుల కోసం
(a) 'పీఎఫ్' (PF) :
- రూ. 15 వేల లోపు వేతనాలు అందుకునే ఉద్యోగులకు సంబంధించిన 12% ఈపీఎఫ్ వాటాను ఉద్యోగులు, యజమానుల తరపున ప్రభుత్వమే మరో మూడు నెలలపాటు చెల్లిస్తుంది. అంటే 2020 ఆగస్ట్ నెల వరకు ప్రభుత్వమే చెల్లిస్తుంది. దీనివల్ల 3.67 లక్షల సంస్థల్లో పనిచేసే 72.22 లక్షల మంది ఉద్యోగులు, యజమానులకు రూ. 2,500 కోట్ల మేర ప్రయోజనం కలుగుతుంది.
(b) 'ఈపీఎఫ్' (EPF) చందా 3 నెలలపాటు 2% తగ్గింపు :
- ఈపీఎఫ్ వాటాను మూడు నెలలపాటు 2% మేర తగ్గించారు.
- దీనివల్ల ప్రైవేట్ సంస్థ యజమానికి 2% మేర నగదు మిగులుతుంది.
- ఉద్యోగి ఇంటికి తీసుకెళ్లే జీతంలో ఆ 2% మేర అధికం కనిపిస్తుంది.
- కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు మాత్రం యాజమాన్య వాటా కింద 12% యథాతథంగా చెల్లిస్తాయి.
- ఈ పథకం వల్ల 6.5 లక్షల సంస్థల్లో పనిచేసే 43 కోట్ల మందికి ప్రయోజనం కలుగుతుంది.
- మూడు నెలలపాటు ఉద్యోగులు, యజమానులకు రూ. 6,750 కోట్ల మేర ద్రవ్యలభ్యత పెరుగుతుంది.
3. బ్యాంకింగ్ యేతర ఆర్ధిక సంఘాల (NBFC) కోసం
(a) రూ. 30,000 కోట్లు ... ప్రత్యేక ద్రవ్యలభ్యత పథకం :
- ప్రస్తుతం రుణ మార్కెట్ల నుంచి 'బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థలు, గృహ ఆర్ధిక కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలు' (NBFC, HFC, MFI) కు నిధులు సమీకరించడం క్లిష్టంగా మారింది. అందుకే రూ. 30,000 కోట్లతో ప్రత్యేక ద్రవ్యలభ్యత పథకాన్ని ప్రకటించారు.
- ప్రాథమిక, సెకండరీ మార్కెట్లోని NBFC, HFC, MFI ల రుణ పత్రాల్లో ఈ పెట్టుబడులు పెడతారు.
- ద్రవ్యలభ్యతను పెంచడానికి ఈ చర్య ఉపయోగపడనుంది.
- సెక్యూరిటీలకు ప్రభుత్వమే 100% హామీనిస్తుంది.
(b) రూ. 45,000 కోట్లు ... పాక్షిక రుణ హామీ పథకం 2.0 :
- తక్కువ క్రెడిట్ రేటింగ్ ఉన్న 'ఎన్ బీ ఎఫ్ సీలు, హెచ్ ఎఫ్ సీలు, ఎమ్ ఎఫ్ ఐ లు చిన్న వ్యాపారులకు తాజాగా రుణాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత 'పాక్షిక రుణ హామీ పథకం' (PCGS ⇒ PARTIAL CREDIT GUARANTEE SCHEME) ను విస్తరించి బాండ్లు / కమర్షియల్ పేపర్ల జారీ వంటి రుణాలకు విస్తరించనున్నారు.
- తొలి 20% నష్టాన్ని హామీదారు అంటే ప్రభుత్వమే భరిస్తుంది.
- ఈ పథకం వల్ల రూ. 45,000 కోట్ల ద్రవ్యలభ్యత వస్తుంది.
4. గుత్తేదారులు - భవన నిర్మాణదారుల కోసం
(a) గుత్తేదార్లు (CONTRACTORS) :
- లాక్ డౌన్ (LOCK DOWN) కారణంగా పనులు చేయలేని పరిస్థితి నెలకొన్నందున కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల్లో చేసే అన్ని రకాల కాంట్రాక్ట్ ల కాలపరిమితిని ఆరు నెలలు (SIX MONTHS) పొడిగించారు.
- ఇందుకు కాంట్రాక్టర్లపై అదనపు జరిమానా ఏమీ విధించరు.
- ఇప్పుడు జరుగుతున్న నిర్మాణాలు, ఇతర పనులు, సేవలకు సంబంధించిన కాంట్రాక్టులన్నింటికీ ఈ పొడిగింపు (SIX MONTHS) వర్తిస్తుంది.
- కాంట్రాక్టర్లు మిగిలిన పనులు పూర్తిచేయడానికి అవసరమైన నగదును అందించడానికి వీలుగా ప్రభుత్వరంగ సంస్థలు తమ దగ్గర ఉన్న బ్యాంకు గ్యారెంటీ (BANK GUARANTEE) లను పాక్షికంగా విడుదల చేస్తాయి.
(b) స్థిరాస్థి రంగం (REAL ESTATE) :
- 'రియల్ ఎస్టేట్ డెవలపర్స్' (REAL ESTATE DEVELOPERS) కి కేంద్రం ఉపశమనాన్ని కల్పించింది.
- "రెరా" (RERA) చట్టం కింద నమోదై ... మార్చ్ 25 తో పూర్తి కావాల్సిన అన్ని రకాల ప్రాజెక్ట్ ల కాలపరిమితిని ఆరునెలలపాటు పొడిగించింది. మళ్లీ అందుకోసం దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేకుండానే ఈ పొడిగింపు వర్తిస్తుంది. అవసరం అనుకుంటే ఈ పరిమితిని మరో మూడు నెలలు పొడిగించడానికీ వెసులుబాటు కల్పించింది. ఇందుకు అనుగుణంగా సవరించిన టైమ్ లైన్ తో ఆటోమేటిక్ గా తాజా ప్రాజెక్ట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు జారీ చేస్తారు. ఈ మేరకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ రాష్ట్రాలకు ఉత్తర్వులు జారీ చేసింది.
- 'కొవిడ్-19' (COVID-19) ని 'రెరా' (RERA) చట్టం కింద "దేవుడి చర్య" (FORCE MAJEURE) గా కేంద్రం పరిగణించింది. అంటే నిర్మాణంలో ఆలస్యం కావడానికి ఎవరి చేతిలో లేని అంశమైన 'కరోనా' (CORONA) యే కారణమని గుర్తించింది.
5. ఆదాయపు పన్ను
(a) వేతనం మినహా ఇతర ఆదాయాలపై టీడీఎస్ రేటులో 25% తగ్గింపు :
- ప్రజల చేతిలో నగదు లభ్యత పెంచేందుకు ప్రభుత్వం ప్రత్యక్ష పన్ను చెల్లింపుదారులకు కొంత ఊరట కలిగించింది.
- వేతనం మినహా వివిధ రకాల ఇతర ఆదాయాలపై చెల్లించే "మూలం వద్ద పన్ను కోత" (TDS ⇒ TAX DEDUCTED at SOURCE) తో పాటు, చెల్లింపులను స్వీకరించేవారు వసూలు చేసే "మూలం వద్ద పన్ను చెల్లింపు" (TCS ⇒ TAX COLLECTED at SOURCE) లో 25 శాతం తగ్గింపును ప్రకటించింది.
- దీని ద్వారా ప్రజలకు రూ. 50,000 కోట్ల వరకు నగదు అందుబాటులోకి వస్తుంది.
- ప్రస్తుత ఆర్ధిక సంవత్సరానికి ఈ తగ్గింపు వర్తిస్తుంది.
- 2020 మే 14 నుంచి 2021 మార్చ్ 31 వరకు వచ్చిన అన్ని రకాల కాంట్రాక్టులు, వృత్తి ఆదాయం, వడ్డీ, అద్దె, డివిడెండ్, కమీషన్, బ్రోకరేజీ తదితర వాటిపై విధించే మూలం వద్ద పన్ను కోత లో 25 శాతం మేరకు తగ్గుతుంది.
- ప్రస్తుతం 10 శాతం వసూలు చేస్తుండగా, బదులు 7.5 శాతంగా మారనుంది.
- ఇది తాత్కాలిక ఉపశమనమే. తర్వాత స్లాబులను బట్టి ఎలాగూ పన్ను చెల్లించాలి.
(b) పన్ను రిటర్నులకు నవంబర్ 30 వరకు గడువు :
- గత ఆర్ధిక సంవత్సరానికి (2019-2020) సంబంధించిన అన్ని రకాల పన్ను రిటర్నుల సమర్పణ తేదీని గతంలో ప్రకటించిన 2020 జూలై 31 నుంచి 2020 నవంబర్ 30 వరకు ప్రభుత్వం పొడిగించింది.
- "వివాద్ సే విశ్వాస్" (VIVAD SE VISHWAS) పథకం 2020 డిసెంబర్ 31 వరకు ఉంటుందని, ఈ సమయంలో ఎలాంటి రుసుములు విధించరని ప్రభుత్వం ప్రకటించింది.
(c) ఆదాయ మదింపు పరిశీలనా తేదీలు :
- ఆదాయ మదింపులకు సంబంధించిన పరిశీలనా తేదీలను 2020 సెప్టెంబర్ 30 నుంచి 2020 డిసెంబర్ 31 వరకు పెంచింది.
- 2021 మార్చ్ 31 తేదీని 2021 సెప్టెంబర్ 30 కు మార్చింది.
6. డిస్కంలు
(a) విద్యుత్తు రంగం :
- డిస్కంలు ... జెన్ కో లకు రూ. 96 వేల కోట్ల మేర బకాయిలున్న నేపథ్యంలో 'పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, రూరల్ ఎలక్ట్రిక్ కార్పొరేషన్' ద్వారా డిస్కంలకు రూ. 90 వేల కోట్ల రుణాలు ఇవ్వడానికి ఈ ప్యాకేజీ అవకాశం కల్పించింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఇందుకు కొన్ని షరతులు పెట్టింది. అవి :
- ఈ రుణాలకు రాష్ట్ర ప్రభుత్వాలు పూచీకత్తు ఇవ్వాలి.
- ఈ మొత్తాన్ని కేవలం జెన్ కో లకు బకాయిలు చెల్లించడానికి మాత్రమే ఉపయోగించాలి. మరే పనికీ వినియోగించకూడదు.
- ప్రత్యేక చర్యలు, సంస్కరణలు కూడా చేపట్టాలి.
- వినియోగదారుల నుంచి చెల్లింపులన్నీ 'డిజిటల్' మార్గంలోనే వసూలు చేయాల్సి ఉంటుంది.
- రాష్ట్ర ప్రభుత్వాలు డిస్కంలకు చెల్లించాల్సిన బకాయిలన్నీ చెల్లించాలి.
- ఆర్ధిక, నిర్వహణ నష్టాలను తగ్గించుకోవడానికి ప్రణాళికలు రూపొందించాలి.
- కేంద్ర ప్రభుత్వరంగ విద్యుత్తు ఉత్పత్తి సంస్థలు డిస్కంలకు ఇచ్చే రాయితీలు అంతిమ వినియోగదారుల (పరిశ్రమలు) కు అందాలి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి