"వైఎస్సార్ ఉచిత వ్యవసాయ విద్యుత్తు" పథకం
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులకు పగటిపూట 9 గంటలపాటు నాణ్యమైన విద్యుత్ అందజేయడానికి ఏర్పాటు చేసిన పథకమే 'వైఎస్సార్ ఉచిత వ్యవసాయ విద్యుత్తు' పథకం.
- ఈ పథకం కింద రైతులకు ఉచిత వ్యవసాయ విద్యుత్తు అందించేందుకు వారు చెల్లించాల్సిన విద్యుత్ బిల్లుల మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే రైతుకు నగదు బదిలీ ద్వారా దీనికోసం ఉద్దేశించిన ప్రత్యేక రైతు బ్యాంక్ ఖాతాలో వేస్తుంది. ఆ అకౌంట్ ద్వారా బిల్లుల మొత్తాన్ని విద్యుత్ సంస్థలకు రైతే చెల్లించడం జరుగుతుంది.
పథకం ముఖ్యోద్దేశం :
'రైతుకు నాణ్యమైన ఉచిత విద్యుత్ ను హక్కుగా అందించడం' ఈ పథకం ముఖ్య ఉద్దేశం.
పథకం ప్రారంభం :
- కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యుత్ సంస్కరణల్లో భాగంగా ఈ పథకాన్ని 2020 డిసెంబర్ నెల నుండి 'శ్రీకాకుళం' జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ (Pilot Project) గా అమలు చేస్తారు. ప్రాజెక్ట్ అమలులో చిన్న చిన్న సమస్యలేమైనా వస్తే పరిష్కరించి, 2021 ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తారు.
పథకం వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలు :
- ప్రభుత్వం నుండి ఎంత ధన సహాయం అందుతుందన్నది రైతుకి స్పష్టం అవుతుంది.
- ప్రభుత్వం నుండి అందుకున్న ధనం విద్యుత్ కంపెనీకి బిల్లు రూపంలో చెల్లించడం వల్ల రైతన్నకు నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం విద్యుత్ కంపెనీని అడిగే హక్కు వస్తుంది. విద్యుత్ కంపెనీలు రైతులకి జవాబుదారీగా నిలుస్తాయి.
- నెల నెలా ప్రభుత్వం రైతుల ఖాతాల్లో డబ్బులు వేయడం, అదే డబ్బును బిల్లుల రూపేణా రైతులు విద్యుత్ కంపెనీలకు చెల్లించడం ద్వారా బకాయిలు అన్నవి విద్యుత్ కంపెనీలకు ఇక ఉండవు కాబట్టి అవి మెరుగైన సేవలు ఖచ్చితంగా అందించగలుగుతాయి.
- మీటర్ల ఏర్పాటు వల్ల వ్యవసాయ పంపుసెట్లకు సరఫరా అవుతున్న విద్యుత్ నాణ్యత మెరుగుపడుతుంది.
- మీటర్లు ఏర్పాటు చేయటం వల్ల ఎవరెవరికి విద్యుత్ అందుతుందో, ఏ రైతుకు ఏ కారణంచేత విద్యుత్ అందడం లేదో వెంటనే తెలుస్తుంది. దీంతో విద్యుత్ అందని మోటార్లకు వెంటనే విద్యుత్ అందించే విధంగా చర్యలు చేపట్టి రైతులకు మేలు చేయవచ్చు.
- రైతు పేరిన తెరిచే ప్రత్యేక ఖాతా కేవలం విద్యుత్ కంపెనీకి చెల్లింపులు చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. నిధులు వ్యవసాయ విద్యుత్ కు నేరుగా చెల్లించేలా ఈ ఖాతా ఉంటుంది.
- ప్రభుత్వం నగదు బదిలీ ఆలస్యం చేసినప్పటికీ, రైతులకు విద్యుత్ సరఫరా ఎట్టి పరిస్థితులలోనూ ఆగదు. ఆమేరకు విద్యుత్ సంస్థలకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.
- ప్రస్తుతం ఎవరి పేరుమీద కనెక్షన్ ఉందో వారి పేరు మీదనే బ్యాంక్ అకౌంట్ తెరిచి దాంట్లో బిల్లు మొత్తం జమ చేస్తారు. కౌలు రైతులు ప్రస్తుతం ఏవిధంగా సాగు చేస్తున్నారో అదేవిధంగా ఇకపై ఉచిత విద్యుత్ పొంది సాగు చేసుకోవచ్చు. వారికి ఎటువంటి అసౌకర్యం ఉండదు.
పథకానికి సంబంధించిన ఇతర విషయాలు :
- మీటరు బిగించడానికి అయ్యే ఖర్చు మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది.
- మీటరు మరమ్మత్తు ఖర్చులు పూర్తిగా విద్యుత్ కంపెనీలు భరిస్తాయి.
- ఒక్క విద్యుత్ కనెక్షన్ కూడా తొలగించరు.
- అనధికార కనెక్షన్ లన్నీ క్రమబద్ధీకరిస్తారు. అనధికార కనెక్షన్ లను గతంలో లాగానే, రూ. 1,200 ప్రతి కిలోవాట్ కి డెవలప్మెంట్ ఛార్జీ మరియు రూ. 40 ప్రతి హెచ్.పి (Horse Power) కి సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించిన తర్వాత సర్వీస్ క్రమబద్ధీకరిస్తారు. క్రమబద్ధీకరణ తర్వాత సర్వీసులకు మీటర్లను కూడా గతంలో లాగానే ప్రభుత్వమే ఉచితంగా అమరుస్తుంది.
- అదనపు లోడ్ కనెక్షన్ లను కూడా క్రమబద్ధీకరిస్తారు. అధిక లోడ్ ఉన్న రైతులకు కూడా ఉచిత విద్యుత్ వర్తిస్తుంది. అదనపు లోడ్ ఉన్నట్లయితే గతంలో ఉన్న రేట్ల ప్రకారమే రూ. 1,200 ప్రతి కిలోవాట్ కి డెవలప్మెంట్ ఛార్జీ మరియు రూ. 40 ప్రతి హెచ్.పి (Horse Power) కి సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించిన తర్వాత అదనపు లోడు క్రమబద్ధీకరిస్తారు.
- చాలా కనెక్షన్లు పూర్వపు భూయజమానుల పేర్లమీద ఉన్నాయి. అటువంటి కనెక్షన్లన్నీ ప్రస్తుత యజమానుల పేర్లమీదకి మారుస్తారు. పట్టాదారు పాసుపుస్తకం, భూ యాజమాన్య హక్కు పత్రం ఆధారంగా పేరు మార్చుకునే అవకాశం ఇప్పుడు వచ్చింది. ప్రస్తుత యజమానికి పేరు మార్పిడికి అవసరమైన రెండు పత్రాలు అందుబాటులో లేకపోతే, గ్రామ రెవిన్యూ అధికారి ధృవీకరించిన వాంగ్మూలం ఆధారంగా, వారి కోరిక మేరకు పేరు మార్చబడుతుంది.
- పేర్ల మార్పు ప్రక్రియ కోసం కానీ, బ్యాంకు ఖాతాలు తెరవడానికి కానీ, రైతు ఎవరి దగ్గరకూ వెళ్లవలసిన అవసరం లేదు. విద్యుత్ కంపెనీ మరియు గ్రామ సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు రైతు దగ్గరకి వచ్చి అవసరమైన మార్పు చేర్పులు చేస్తారు.
- రైతులకు రానున్న 30 సంవత్సరాలు శాశ్వతంగా ఉచిత విద్యుత్ అందజేయడానికి 10,000 మెగావాట్ల 'సోలార్ పవర్ ప్రాజెక్ట్'ను ప్రభుత్వమే బాధ్యత తీసుకుని చేపడుతోంది.
పథకం అమలులో సమస్యలుంటే ... :
- విద్యుత్ సంస్థల టోల్ ఫ్రీ నంబర్ 1912 కి ఫోన్ చేసి ఫిర్యాదులు పరిష్కరించుకోవచ్చు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి