మిషన్ కర్మయోగి (MISSION KARMAYOGI)
- ప్రభుత్వ ఉద్యోగుల సామర్థ్యాన్ని నిరంతరం పెంచడానికి కేంద్ర ప్రభుత్వం "మిషన్ కర్మయోగి" కి శ్రీకారం చుడుతోంది.
- ప్రధానమంత్రి 'నరేంద్ర మోదీ' అధ్యక్షతన 2020 సెప్టెంబర్ 2 న జరిగిన మంత్రివర్గ సమావేశం 'మిషన్ కర్మయోగి' కి ఆమోదముద్ర వేసింది.
- కేంద్ర ప్రభుత్వంలోని అన్ని స్థాయుల ఉద్యోగుల సామర్థ్యం ఎప్పటికప్పుడు పెరగడానికి, 'తగిన వ్యక్తికి తగిన పని' అప్పగించడానికి 'మిషన్ కర్మయోగి' ఉపయోగపడుతుంది.
- వ్యవస్థాగత సమర్ధత పెంచడానికి అవసరమైన చర్యలు తీసుకుంటుంది. దీనికోసం ఒక 'ప్రత్యేక అవసర సంస్థ' (SPV ⇒ SPECIAL PURPOSE VEHICLE) ను ఏర్పాటు చేస్తారు.
ఉద్దేశ్యం :
ప్రభుత్వ ఉద్యోగి ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే 'సివిల్ సర్వీసులలో సామర్థ్యం పెంపునకు జాతీయ కార్యక్రమం' 'మిషన్ కర్మయోగి' (MISSION KARMAYOGI) యొక్క ముఖ్యోద్దేశం.
'మిషన్ కర్మయోగి' ఆలోచనకు పునాది :
2017 లో ముస్సోరిలోని ఐఏఎస్ ల శిక్షణ కేంద్రాన్ని ప్రధాని సందర్శించినప్పుడు ఈ ఆలోచన (MISSION KARMAYOGI) కు పునాది పడింది. అక్కడ రెండు రోజులపాటు బస చేసి శిక్షణార్థులతో మాట్లాడినప్పుడు శిక్షణ విధానం మార్చాలన్న విషయం అర్థమైంది. తమతమ విభాగాలకే పరిమితమయ్యేలా కాకుండా సంపూర్ణ దృక్పథంతో అందరు సివిల్ సర్వెంట్లు పనిచేయాల్సి ఉందని గుర్తించారు. పూర్తిగా మథనం చేసి ఈ కొత్త వ్యవస్థ (MISSION KARMAYOGI) కు రూపకల్పన చేశారు.
'మిషన్ కర్మయోగి' - కొన్ని విశేషతలు :
- ఇదివరకు శిక్షణ కేవలం నిబంధనల (RULES) ఆధారంగా ఉండేది. ఇప్పుడు అది ఉద్యోగి పాత్ర (ROLE) ఆధారితంగా ఉంటుంది.
- ఉన్నత చదువులు, సామర్థ్యం పెంచుకొనే అవకాశాలు కొందరు అధికారులకే ఉండేవి. ఇప్పుడు అందరికీ అవి అందుబాటులోకి వస్తాయి.
- ఇదివరకు అఖిల భారత సేవలకే పరిమితమైన మధ్యంతర శిక్షణ (MID CAREER TRAINING) ను ఇప్పుడు అన్ని సర్వీసులకూ, అన్నిస్థాయుల్లోని అధికారులకూ వర్తింపజేస్తారు. దీని నిమిత్తం డీటీహెచ్ (DTH ⇒ DIRECT-TO-HOME) లో 'కర్మయోగి' టీవీ ఛానల్ ఏర్పాటు చేస్తారు.
- ప్రతి ఒక్క అధికారి పనితీరు డిజిటల్ రూపంలో నిక్షిప్తమై ఉంటుంది. నియామకాల విషయంలో పనితీరు ఆధారంగా నిర్ణయాలు తీసుకోవచ్చు. ఉద్యోగుల పనితీరుపై పూర్తిగా శాస్త్రీయ సమీక్ష జరుగుతుంది.
- భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా ప్రభుత్వ ఉద్యోగుల్ని తీర్చిదిద్దుతుంది.
- పారదర్శకత, సాంకేతికతల మేళవింపుతో నిర్మాణాత్మకంగా, నవ్యావిష్కరణల దిశగా వారిని సానబెడుతుంది.
- ప్రస్తుత వ్యవస్థ కారణంగా ఉద్యోగులు తమతమ శాఖలవారీగానే ఆలోచిస్తున్నారు తప్పిస్తే విశాల జాతీయ దృక్పథంతో చూడటంలేదు. ఇకమీదట ఉద్యోగులంతా ఒకేలా పనిచేసేలా శిక్షణ ఇస్తారు. ఇది జవాబుదారీతనాన్ని, పారదర్శకతను తీసుకొస్తుంది.
- ప్రభుత్వంలో కిందిస్థాయి ఉద్యోగి నుంచి కేంద్ర కేబినెట్ కార్యదర్శి వరకు పోషించాల్సిన పాత్రను నిర్వచించి, సమకూర్చుకోవాల్సిన సామర్ధ్యాల గురించి చెబుతారు. వాటిని పెంచడానికి 'ఐగాట్ కర్మయోగి డిజిటల్ ప్లాట్ ఫార్మ్' (I-GOT Karmayogi Digital Platform) ద్వారా శిక్షణ ఇస్తారు.
- శిక్షణానంతరం ఉద్యోగాల్ని ఖాయం చేయడం, వారికి బాధ్యతలు కేటాయించడం, ఖాళీలను ప్రకటించడం వంటివన్నీ క్రమేపీ ఒకే వ్యవస్థ కిందికి వస్తాయి.
- ప్రపంచంలో అతిపెద్ద ప్రభుత్వ ఉద్యోగుల సంస్కరణగా 'మిషన్ కర్మయోగి' నిలవనుంది.
- సులభ జీవనం, సులభతర వాణిజ్యం మరింత మెరుగుపడటం, ప్రభుత్వం-ప్రజల మధ్య అగాధం తగ్గడమే ఈ సంస్కరణ (MISSION KARMAYOGI) అంతిమ లక్ష్యం.
'మిషన్ కర్మయోగి' వ్యవస్థ రూపం :
- శిక్షణ కార్యక్రమం పర్యవేక్షణకు 'ప్రధానమంత్రి మానవ వనరుల మండలి' (PM-HR COUNCIL) పేరిట కొత్త వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. ప్రధాని అధ్యక్షతన పనిచేసే ఈ మండలిలో కేంద్ర కేబినెట్ మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, విభిన్న రంగాల దేశ, విదేశీ నిపుణులు, సివిల్ సర్వీస్ ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు.
- కేబినెట్ కార్యదర్శి ఆధ్వర్యంలో సమన్వయ విభాగం ఉంటుంది. అది వ్యూహాత్మక దిశానిర్దేశం చేస్తుంది. సివిల్ సర్వీస్ సామర్ధ్య పెంపు ప్రణాళికను ఆమోదించి, పర్యవేక్షిస్తుంది.
- 'మిషన్ కర్మయోగి' నిర్వహణ కోసం స్వయం ప్రతిపత్తితో పనిచేసే 'కెపాసిటీ బిల్డింగ్ కమిషన్' (CAPACITY BUILDING COMMISSION) ను ఏర్పాటు చేస్తారు. ఇది ప్రామాణిక శిక్షణ కార్యక్రమాన్ని రూపొందిస్తుంది. దేశంలోని అన్ని శిక్షణ సంస్థలు దీని పరిధిలోకి వస్తాయి. వాటి ఆర్ధిక, మానవ వనరులను ఇదే పర్యవేక్షిస్తుంది. అభివృద్ధి ఆకాంక్షలు, లక్ష్యాలు, జాతీయ ప్రాధాన్యాలు, సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి దేశవ్యాప్తంగా ఒకే విధానం అనుసరించేలా మార్గనిర్దేశం చేస్తుంది.
- డిజిటల్ వనరుల నిర్వహణకు, ఆన్ లైన్ శిక్షణకు కంపెనీల చట్టం కింద ఏర్పాటయ్యే 'ఎస్ పీ వీ' (SPV) ద్వారా ప్రపంచంలో అత్యుత్తమ స్థాయి విషయాన్ని (CONTENT) సేకరించి ప్రభుత్వంలో అందరికీ అందుబాటులో ఉంచుతుంది. ఈ మొత్తం వ్యవస్థ కోసం ఐదేళ్లలో రూ. 510 కోట్లు ఖర్చవుతుందని అంచనా. దీని నిమిత్తం ప్రతి సివిల్ సర్వెంట్ నుంచి ఏటా రూ. 431 వసూలు చేస్తారు.
- 'ఎస్ పీ వీ' (SPV) ని రాష్ట్రాలు, ఇతర దేశాలకూ అందుబాటులో ఉంచుతారు. ఆసక్తి ఉన్న ఎవరైనా కేంద్రంతో సంప్రదించి దీన్ని ఉపయోగించుకోవచ్చు.
'మిషన్ కర్మయోగి' ద్వారా ప్రభుత్వం ఆశిస్తున్న సామర్థ్యాలు :
- సృజనాత్మకత
- వినూత్నత
- సరళత
- వృత్తి నైపుణ్యత
- ప్రగతిశీలత
- ఉత్సాహం
- సమర్ధత
- పారదర్శకత
- సాంకేతికత
- నిర్మాణాత్మకత
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి