![]() |
| "యాస్" తుఫాను భీభత్సం |
'యాస్' తుఫాను పుట్టు పూర్వోత్తరాలు (ANCESTORS OF 'YAAS' CYCLONE) :
'భారత వాతావరణ విభాగం' (IMD) తెలిపిన వివరాల ప్రకారం .. 2021 మే 22న ఉదయం తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. అదే రోజు సాయంత్రానికి తీవ్ర అల్పపీడనంగా బలపడింది. ఇది 2021 మే 23 ఉదయం వాయుగుండంగా మారింది. సాయంత్రానికి ఇది 'పోర్ట్ బ్లెయిర్' కి ఉత్తర వాయువ్య దిశగా 590 కి.మీ, 'పారాదీప్' కి దక్షిణ ఆగ్నేయంగా 570 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉత్తర వాయువ్య దిశగా కదిలి 2021 మే 24న "యాస్" (YAAS CYCLONE) తుఫాను ఏర్పడినట్లు 'భారత వాతావరణ విభాగం' (IMD) తెలిపింది.
'యాస్' తుఫాను నామకరణం (NOMENCLATURE OF 'YAAS' CYCLONE) :
ఈ తుఫానుకు "యాస్" (YAAS) అనే పేరును 'ఒమన్' (OMAN) దేశం సూచించింది. అక్కడి భాషలో దీనికి "మల్లెపువ్వు" అని అర్థం.
'యాస్' తుఫాను తీరం దాటిన ప్రదేశం (LANDFALL OF 'YAAS' CYCLONE) :
బంగాళాఖాతంలో ఏర్పడిన 'యాస్' తుఫాను (YAAS CYCLONE) 'పశ్చిమ బెంగాల్, ఒడిశా' రాష్ట్రాలను వణికించి, 2021 మే 26న ఉదయం 'ఒడిశా' లోని బాలేశ్వర్ జిల్లాకు చేరువలోని "బహనాగ" (BAHANAGA) వద్ద తీరాన్ని తాకింది. ఆ సమయంలో అక్కడకు సమీపంలోని ధామ్రా ఓడరేవు చుట్టుపక్కల కుంభవృష్టి కురిసింది. అనేక కచ్చా ఇళ్లు నేలమట్టమయ్యాయి. తుఫాను తీరాన్ని దాటే ప్రక్రియ మధ్యాహ్నం 1.30కి పూర్తయింది.
'యాస్' తుఫాను వలన ప్రభావితమైన ప్రాంతాలు ('YAAS' CYCLONE EFFECTED AREAS) :
'ఒడిశా' లోని భద్రక్, బాలేశ్వర్ తీర జిల్లాలపై మరియు 'పశ్చిమ బెంగాల్' లోని పలు ప్రాంతాలపై 'యాస్' తుఫాను ప్రభావం చూపింది. గంటకు 100 - 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. 24 గంటల వ్యవధిలో 'మయూర్ భంజ్' లో రికార్డు స్థాయిలో 304 మి.మీ. , భద్రక్ జిల్లాలోని చాంద్ బాలి లో 288 మి.మీ., వర్షపాతం నమోదైంది. కేంద్రపారా లోని రాజ్ కనిక లో 251 మి.మీ., వర్షం కురిసింది. ఒడిశాలో ముగ్గురు, పశ్చిమ బెంగాల్ లో ఒకరు మృతి చెందారు. పశ్చిమ బెంగాల్ లోని పర్యాటక ప్రదేశమైన 'దిఘా' పూర్తిగా నీట మునగడంతో సహాయక చర్యల నిమిత్తం సైన్యాన్ని రంగంలోకి దించారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి