జాతీయ నియామకాల సంస్థ
(NATIONAL RECRUITMENT AGENCY)
- ఒకే దేశం - ఒకే పరీక్ష అనే రీతిలో కేంద్రంలోని వివిధ శాఖల్లోని ఖాళీల భర్తీ కోసం "జాతీయ నియామకాల సంస్థ" (NATIONAL RECRUITMENT AGENCY ⇒ NRA) ని ఏర్పాటు చేయాలని 2020 ఆగస్ట్ 19 న ప్రధాని 'నరేంద్ర మోదీ' అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రిమండలి నిర్ణయించింది.
- రైల్వే (RRB), బ్యాంకింగ్ (IBPS), స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కింద వేర్వేరుగా భర్తీ చేసే ఉద్యోగాలకు ఒకే ఉమ్మడి ప్రాథమిక అర్హత పరీక్ష నిర్వహించేందుకు ఈ ఏజెన్సీ (NRA) ని ఏర్పాటు చేసినట్లు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ సహాయ మంత్రి 'జితేంద్రసింగ్' వెల్లడించారు. దశలవారీగా ఈ సంస్థలను పెంచుకుంటూ వెళ్తామని చెప్పారు.
- స్వతంత్ర భారతదేశంలో ఇదో విప్లవాత్మక సంస్కరణ.
- ఎన్ ఆర్ ఎ (NRA) పరిధిలోకి కేంద్ర ప్రభుత్వంలోని 20 నియామక సంస్థలను తీసుకొస్తారు.
- దేశంలోని ప్రతి జిల్లాలో కనీసం ఒకటి చొప్పున సుమారు వెయ్యి పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. అభ్యర్థులు ఎక్కువగా ఉన్నచోట ఒకటికి మించి నెలకొల్పుతారు. గ్రామీణ అభ్యర్థులు దూరప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా సొంత జిల్లాలోనే పరీక్ష రాయడానికి వీలవుతుంది.
- ఏటా రెండుసార్లు నిర్వహించే ఈ పరీక్షల్లో విద్యార్థులు సాధించే స్కోర్ మూడేళ్లు చెల్లుబాటవుతుంది. స్కోర్ పెంచుకోవడానికి అభ్యర్థులు మళ్లీ మళ్లీ పరీక్షలు రాయొచ్చు. అత్యుత్తమ స్కోర్ నే పరిగణనలో తీసుకుంటారు.
- ప్రస్తుతం 12 భాషల్లో పరీక్ష జరుగుతుంది. తర్వాత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్ లో ఉన్న భారతీయ భాషలన్నింటిలో నిర్వహిస్తారు.
- వేర్వేరు రుసుములతో అనేకసార్లు పరీక్షలకు హాజరు కావాల్సిన అవసరం ఉండదు.
- ఆర్ ఆర్ బీ (RAILWAY RECRUITMENT BOARD), ఎస్ ఎస్ సి (STAFF SELECTION COMMISSION), ఐ బీ పీ ఎస్ (INSTITUTE of BANKING PERSONNEL SELECTION) కింద ఏటా 1.25 లక్షల గ్రూప్ - బి, సి ఉద్యోగాల ఖాళీలు ఏర్పడుతున్నాయి.
- వీటికి దాదాపు 3 కోట్ల మంది హాజరవుతుంటారు. ఖాళీల భర్తీకి 12-18 నెలల సమయం పట్టేది.
- నియామక పరీక్షల్లో ఒక అంచె తగ్గించడానికి ఈ మూడు సంస్థలకు (RRB, SSC, IBPS) కలిపి ఉమ్మడి అర్హత పరీక్ష నిర్వహిస్తారు. దీనిలో స్కోర్ ఆధారంగా ఇవి తదుపరి పరీక్షలను వేర్వేరుగా నిర్వహించి, అభ్యర్థులను ఎంపిక చేసుకోవచ్చు.
- ఎన్ ఆర్ ఏ (NRA) ను స్వయం ప్రతిపత్తి గల సంస్థగా ఏర్పాటు చేస్తారు. చైర్మన్ గా కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి స్థాయి అధికారి ఉంటారు. పాలకమండలిలో RRB, SSC, IBPS ల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు.
- తొలి మూడేళ్లలో నిర్వహణకు రూ. 1,517.57 కోట్లు కేటాయిస్తారు.
- నూతన విధానం వల్ల తుది పరీక్షలు రాసే అభ్యర్థుల సంఖ్య 5 శాతానికి పరిమితం అవుతుంది.
- తొలిదశ పరీక్షను ఆన్లైన్ (ONLINE) లో నిర్వహిస్తారు. తక్షణం స్కోర్ లభిస్తుంది. దాని ఆధారంగా అభ్యర్థి ఈ మూడు బోర్డుల్లోని (RRB, SSC, IBPS) ఏదైనా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకొని, దానికి అవసరమైన తదుపరి దశ పరీక్ష రాయొచ్చు.
- ప్రస్తుతం ఈ ఏజెన్సీ (NRA) పరిధిని 3 నియామక బోర్డులకే (RRB, SSC, IBPS) వర్తింపజేస్తున్నారు. అంతా గాడిన పడుతున్నకొద్దీ కేంద్రంలోని 20 నియామక సంస్థలనూ దీని పరిధిలోకి తీసుకువస్తారు.
- అన్ని ప్రాథమిక పరీక్షలకూ ఒకే సిలబస్ ఉంటుంది. అభ్యర్థులు వేర్వేరుగా సన్నద్ధం కావాల్సిన అవసరం ఉండదు.
- ఉమ్మడి రిజిస్ట్రేషన్ పోర్టల్ ఏర్పాటు చేస్తారు. దీనిద్వారా అభ్యర్థులు తమకు సమీపంలోని కేంద్రాలను ఎంచుకోవచ్చు.
- ఒకే క్వశ్చన్ బ్యాంక్ (QUESTION BANK) ఉంటుంది. సురక్షితమైన, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కేంద్రీయంగా సర్వర్ ను నిర్వహిస్తారు.
- 117 ఆకాంక్షిత జిల్లాల నుంచి ఉద్యోగాల్లో ప్రాతినిధ్యం పెంచడానికి ప్రత్యేక చేయూతనందిస్తారు. అక్కడి వారికి అవసరమైన సాయం చేయడానికి 24 గంటల హెల్ప్ లైన్ ఏర్పాటు చేస్తారు. ఈ జిల్లాల్లో పరీక్ష కేంద్రాలకు అవసరమైన వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వం 'వ్యయ సర్దుబాటు నిధి' ఇస్తుంది.
- పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ అర్హతల ప్రకారం పరీక్షలు నిర్వహిస్తారు.
- గరిష్ఠ వయోపరిమితి లోపు ఎన్నిసార్లయినా అభ్యర్థులు వీటిని రాయవచ్చు.
- ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు వయోపరిమితిలో నిబంధనల మేరకు సడలింపు ఇస్తారు.
- అభ్యర్థుల స్కోర్లు ప్రభుత్వ, ప్రభుత్వరంగ, ప్రైవేటు సంస్థలకు అందుబాటులో ఉంటాయి. వీటి ఆధారంగా అవి నియామకాలు చేపట్టవచ్చు.
- రెండో దశ పరీక్ష అవసరం లేకుండా మొదటి దశలోని స్కోర్, వైద్య పరీక్షల ఆధారంగానే నియామకాలు చేసుకుంటామని కొన్ని సంస్థలు సూచనప్రాయంగా చెప్పడం అభ్యర్థులకు మరింత ఊరటగా ప్రభుత్వం పేర్కొంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి